ఇక సత్వర పరిష్కారం!



పెండింగ్‌ కేసులకు ప్రత్యేక కోర్టులు
రూ.5వేల కోట్ల కేంద్ర నిధులు
మాజీ న్యాయమూర్తులకు మళ్లీ విధులు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
కోర్టుల్లో ఓ పట్టాన తెమలని కేసులతో ప్రజల్లో న్యాయవ్యవస్థపై సడలుతున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కింది కోర్టుల్లో 5 ఏళ్ల ప్రణాళికను నిర్దేశించుకుంది. ప్రస్తుతం కోర్టుల్లో ఒక్కో కేసు తేలడానికి 15 ఏళ్లకు పైగానే పడుతోంది. దీన్ని 3 ఏళ్లకు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం 13వ ఆర్థిక సంఘం రూ.5వేల కోట్లను కేటాయించింది. మొదటి విడతగా రాష్ట్రాలకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలోని కింది కోర్టుల్లో 2.71 కోట్లకు పైగా కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇందులో 40% చిన్న కేసులుంటాయని ఆర్థిక సంఘం అంచనా. 2010-2014 కల్లా ఇందులో 2.25 కోట్ల కేసులను పరిష్కరించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనికోసం 13వ ఆర్థిక సంఘం నిధులతో దేశవ్యాప్తంగా 14825 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనుంది. వీటిలోకి మాజీ జడ్జిలను, లేదంటే అవే అర్హతలున్న వ్యక్తులను కాంట్రాక్టు పద్ధతిన తీసుకోనుంది. వీరు నెలకు 150 కేసులను పరిష్కరించాల్సి ఉంటుంది. వీటితోపాటు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గం (ఏడీఆర్‌), లోక్‌అదాలత్‌ల బలోపేతానికి నిధుల కేటాయించారు. ఈ ప్రణాళిక అమలులో భాగంగా ఢిల్లీలో ఇటీవల అన్ని రాష్ట్రాల న్యాయశాఖ కార్యదర్శులు, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరళ్ల సమావేశాన్ని కేంద్రం నిర్వహించింది. 13వ ఆర్థిక సంఘం రూపొందించిన మార్గదర్శకాల్లో ఆచరణ సాధ్యం కాని అంశాలను సవరించాలని సమావేశం తీర్మానించింది. ప్రస్తుతం ఉన్న జడ్జీలకు అదనపు వేతనం చెల్లిస్తూ ఉదయం, సాయంత్రం కోర్టుల ద్వారా కేసులను పరిష్కరించాలని తొలుత నిర్ణయించినా, ఇది వారిపై మరింత భారాన్ని మోపుతుందని పేర్కొన్నారు. అందువల్ల ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
రాష్ట్రంలోనూ..
పెండెన్సీ కేసుల పరిష్కారానికిగాను కేంద్రం రాష్ట్రానికి రూ.270 కోట్లను కేటాయించింది. ఇందులో రూ.145.18 కోట్లను ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు కేటాయింపు జరిగింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు పంపిన ప్రతిపాదనలను ఆమోదించింది. ఇందులో భాగంగా 140 ప్రత్యేక మేజిస్ట్రేట్‌ కోర్టులు, 113 ప్రత్యేక జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులను ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9.62 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2013 కల్లా వీటి సంఖ్యను 2.15 లక్షలకు తీసుకురావాలన్నది లక్ష్యం.
* ఒక్కో ప్రత్యేక మేజిస్ట్రేట్‌ కోర్టు ఏర్పాటుకు రూ.14.56 లక్షలవుతుందని అంచనా. 140 ప్రత్యేక కోర్టుల జడ్జీలకు జీతాలకు రూ.21 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల కోసం మొదటి ఏడాది రూ.2.80 కోట్లు అవసరమని లెక్కకట్టింది.
* ఒక్కో జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు ఏడాదికి సుమారు రూ.1.26 లక్షల ఖర్చవుతుందని అంచనా. 113 కోర్టులకుగాను సుమారు రూ.1.47 కోట్లవుతుంది.
* ఈ కోర్టుల్లో ఇప్పటికే నియామక ప్రక్రియ మొదలైంది. ఒకటి రెండు నెలల్లో ప్రత్యేక కోర్టులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాదికల్లా పూర్తిస్థాయిలో కోర్టుల ఏర్పాటు జరగనుంది.
Tags:

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.

0 comments

Leave a Reply