కార్టూన్‌ అయిపోతే!



ఇష్టమైన ఫొటోను కార్టూన్‌లా మార్చాలంటే Photo to Cartoon టూల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. 



సరికొత్త 'రోల్‌టాప్‌'

హ్యాండ్‌ బ్యాగులా కనిపించే ల్యాప్‌టాప్‌ ఇది. పేరు Rolltop. బ్యాగు పైభాగం ఆడాప్టర్‌లా మారిపోతుంది. OLED డిస్‌ప్లేతో వీడియోలు చూడొచ్చు. కావాలంటే టాబ్లెట్‌లా మార్చుకుని స్త్టెలస్‌తో బొమ్మలు గీయవచ్చు. వెనక ఏర్పాటు చేసిన స్టాండ్‌తో టీవీలా నిలబెట్టి వీడియోలు చూడొచ్చు. వీడియో, ఇతర వివరాలకు



వెబ్‌ విహారం ఇలా సులభం

వెబ్‌ బ్రౌజింగ్‌ను మరింత సులభతరం చేసే సౌకర్యాలు తెలుసా? అవే ఇవి...
డౌన్‌లోడ్‌ చేసే సమాచారాన్ని, పాటల్ని, సాఫ్ట్‌వేర్‌లను పర్యవేక్షించే మేనేజర్‌ కావాలంటే Free Download Managerను నిక్షిప్తం చేసుకోండి. టూల్‌బార్‌లో ఎన్నో అదనపు సౌకర్యాలు. ఏదైనా ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేయగానే టూల్‌ వస్తుంది. డౌన్‌లోడ్‌ చేసే ఫైల్‌ ఎక్కడ సేవ్‌ అవ్వాలో ముందే నిర్ణయించవచ్చు. వీడియో ఫైల్స్‌ డౌన్‌లోడ్స్‌ని ప్రివ్యూ చూడొచ్చు కూడా.



వేగం పెరిగితే!
ఒకే క్లిక్కుతో ఫైర్‌ఫాక్స్‌ వేగాన్ని పెంచాలంటే SpeedyFoxను పొందండి. రన్‌ చేయగానే వచ్చిన విండోలో Speed Up my Firefoxపై క్లిక్‌ చేసి తగ్గిన వేగాన్ని పెంచొచ్చు. 
'సోషల్‌' టూల్‌బార్‌
సైట్‌ అడ్రస్‌, బుక్‌మార్క్‌ల అవసరం లేకుండా MyStart Social Toolbar టూల్‌బార్‌ ద్వారా ఒకే క్లిక్కుతో కావాల్సిన సోషల్‌ నెట్‌వర్క్‌లోకి వెళ్లొచ్చు. టూల్‌బార్‌లో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌, మైస్పేస్‌... నెట్‌వర్క్‌లు వరుసగా కనిపిస్తాయి. WebTV గుర్తుపై క్లిక్‌ చేసి టీవీ చూడొచ్చు. ఈ-షాపింగ్‌ సర్వీసుల్ని ఒకేచోట పొందొచ్చు.





అన్నీ తెరపైనే!
బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయకుండానే సెర్చ్‌, న్యూస్‌, ఆన్‌లైన్‌ నిఘంటువు, కరెన్సీ కన్వర్టర్‌, పాస్‌వర్డ్‌ కీపర్‌, వాతావరణ వివరాలు... లాంటి సర్వీసుల్ని పొందాలంటే A-ToolBar ఉంటే సరి. ఐకాన్ల రూపంలో మొత్తం సర్వీసులు తెర పైనే ప్రత్యేక టూల్‌బార్‌లో కనిపిస్తాయి. గేమ్స్‌ కూడా ఉన్నాయి. http://goo.gl/KMW0N




'స్లిమ్‌' బ్రౌజర్‌
ఎప్పుడైనా SLIMBROWSER వాడారా? బ్రౌజింగ్‌లో సందర్శించిన పేజీలను Share this pageతో సులభంగా సోషల్‌నెట్‌వర్క్‌ సభ్యులతో పంచుకునే వీలుంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, బజ్‌, StumbleUpon ఉన్నాయి. వెబ్‌ పేజీలను ఇతరులకు మెయిల్‌ చేయవచ్చు. జీమెయిల్‌, యాహూ, హాట్‌మెయిల్‌ సర్వీసులు సిద్ధంగా ఉన్నాయి. Groups, AutoLogin మెనూలతో అదనపు సౌకర్యాల్ని పొందొచ్చు. ట్యాబ్‌ విండోలను మాయం చేయవచ్చు.



దొంగలకిది... వేసవి విడిది


రాజధానిలో వరస దోపిడీలు
అంతర రాష్ట్ర ముఠాల అలజడి
పట్టపగలే రెచ్చిపోతున్న చోరులు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాజధాని నగరంలో అంతర రాష్ట్ర దొంగల ముఠాలు అలజడి సృష్టిస్తున్నాయి. నగరం, శివారు తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. పట్టపగలే రెప్పపాటులో భారీగా దోచేస్తున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దొంగలు ఇక్కడ వరసబెట్టి చోరీలు చేస్తున్నారు. రాష్ట్ర అధికార యంత్రాంగమంతా కేంద్రీకృతమై ఉండే రాజధానిలో... జంటకమిషనరేట్ల పరిధిలో... రెండు రోజులకోచోట దొంగలు చెలరేగిపోతున్నారు. పోలీసుల మధ్య సమన్వయలేమి, సిబ్బంది కొరత, విధులపై నిర్లక్ష్యం మరికొంత... ఇవన్నీ కలగలిసి పౌరుల సొత్తును చోరులపాలు చేస్తున్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా డీజీపీ స్థాయిలో ఒక్కసారి కూడా సమీక్ష జరగకపోవడం గమనార్హం. శివారులో ఇళ్లపై పడి కొట్టి దోచుకుంటుండగా, నగరంలో బ్యాంకు నుంచి నగదు తీసుకెళుతున్న వారిపైనా, బంగారం వ్యాపారులపైనా ఈ ముఠాలు దృష్టిపెట్టాయి. కొన్ని ముఠాలు కేవలం వేసవిలోనే హైదరాబాద్‌లో విడిది చేసి మరీ దోచుకుంటున్నట్లు వెల్లడికావడం విశేషం. చాలామంది వేసవి సెలవులు కావడంతో ఇళ్లకు తాళాలు వేసుకుని ఊళ్లకు వెళ్లారు. వారు తిరిగి వస్తే మరిన్ని చోరీ కేసులు వెలుగుచూసే అవకాశముంది. హైదరాబాద్‌లో అత్యంత రద్దీ ప్రాంతం... పంజాగుట్టలో కేవలం 72 గంటల వ్యవధిలో వేర్వేరు సంఘటనల్లో రూ. 28 లక్షల నగదు దోచుకెళ్లారు. సికింద్రాబాద్‌లో ఒక బంగారు నగల వ్యాపారి వద్ద సెంట్రల్‌ ఎక్సైజ్‌ పోలీసులమంటూ బెదిరించి అర కిలో ఆభరణాలను మాయం చేశారు. ఇలా వరస దొంగతనాలు చేస్తున్నది రాంజీనగర్‌, ఇరానీ గ్యాంగ్‌ ముఠాలని పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. వీరిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు.
రాంజీనగర్‌ ముఠా చోరీల తీరు ఇది
దృష్టి మళ్లించి నగదు దోచుకెళ్లడం రాంజీ నగర్‌ ముఠా ప్రత్యేకత. తమిళనాడులోని రాంజీ నగర్‌కు చెందిన ఈ ముఠా మార్చి నుంచి మే వరకూ హైదరాబాద్‌లో ఉంటుంది. ఇద్దరు లేక ముగ్గురు ఒక బృందంగా ఏర్పడి దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడతారు. రద్దీగా ఉండే బ్యాంకులు, కార్లు, ద్విచక్రవాహనాలపై ఒంటరిగా నగదుతో వెళ్లే వారు వీరి లక్ష్యాలు. క్షణాల్లో కళ్లుగప్పి ఎత్తుకెళ్లిపోతారు.
మేమే పోలీస్‌ అంటూ ఇరానీ ముఠా
ఇరానీ గ్యాంగ్‌ది నకిలీ పోలీస్‌ వేషం. కర్ణాటకలోని బీదర్‌, బళ్లారి, గుల్బార్గా, మహారాష్టలోని థానే, పుణే, కల్యాణ్‌ ప్రాంతాల్లో వీరు నివాసముంటున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. సుమారుగా 200 మంది ఉంటారని పోలీసుల అంచనా. నగల వ్యాపారులు, ఒంటరి మహిళలు వీరి లక్ష్యాలు. తాము పోలీసు అధికారులమని, సంచి తనిఖీ చేయాలంటూ చెప్పి ఆభరణాలు నేర్పుగా చేజిక్కించుకుని జారుకుంటారు. ఈ గ్యాంగ్‌ కూడా వేసవిలోనే ఇక్కడికి వస్తుంది.
 
పోలీసులు ఏంచేస్తున్నారు?
* పోలీసులు ఇప్పటి వరకూ ఈ ముఠాలను పట్టుకోలేకపోయారు. నేర పరిశోధన విభాగంలోని 2బృందాలు రాంజీనగర్‌కు వెళ్లినా... అక్కడి పోలీసులు సహకరించకపోవడంతో వచ్చేశారు. * ముంబయికి సమీపంలో ఇరానీ గ్యాంగ్‌ ఉంటున్న ప్రాంతానికి వెళ్లిన ఇద్దరు పోలీసు అధికారులపై ఆ ముఠా సభ్యులు దాడిచేయగా... వారు వెనక్కి వచ్చేశారు. ఈ అనుభవాల నేపథ్యంలో ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేక బృందాలను పంపిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ ఏకేఖాన్‌ తెలిపారు.
* జంటకమిషనరేట్ల అధికారులు సమన్వయం కోసం ఈమధ్యే ఓ సమావేశం నిర్వహించారు. దొంగల్ని పట్టుకోడానికి ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. ఒక బృందం రాంజీనగర్‌కి వెళ్లింది. మరో మూడు బృందాలు హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధుల్లో నిఘాపెట్టాయి.
ఇవీ అలజడులు...
* సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇటీవలికాలంలో 138 దొంగతనాలు నమోదయ్యాయి. రూ. 75 లక్షల విలువైన బంగారం దొంగల పాలైంది.
* వనస్థలిపురం హైకోర్టు కాలనీలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. అడ్డొచ్చిన వారిపై ఇనుపరాడ్లతో దాడి చేసి అందినంతా దోచుకున్నారు.
* హయత్‌నగర్‌లోని పద్మావతినగర్‌ విశ్రాంత అధ్యాపకుడి ఇంట్లోకి చొరబడి, పోలీసులమంటూ తుపాకులతో బెదిరించి, 20 తులాల సొత్తు తీసుకెళ్లారు.
* ఎల్బీనగర్‌లోని సాయినగర్‌లో దోపిడీ దొంగలు పట్టపగలే చొరబడి భర్త కళ్ల ముందే భార్యను హత్య చేసి, 10 తులాల బంగారం దోచుకెళ్లారు.
* గతనెల మోహిదీపట్నంలో ప్రభుత్వ అధికారి ఇంటికి వెళుతుండగా ఆమె బ్యాగులోని 30 తులాల బంగారు ఆభరణాలు, నగలను దోచుకుని వెళ్లారు.
* పాతబస్తీలో 45 రోజుల వ్యవధిలో జరిగిన రెండు సంఘటనల్లో బంగారం తీసుకెళుతున్న ఇద్దరు ఉద్యోగుల నుంచి పోలీసులమంటూ 37 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.
* ఏప్రిల్‌లో సుల్తాన్‌బజార్‌లో కోఠి రంగమహల్‌ చౌరస్తాలో పెట్రోలుబంకులో 4.5లక్షలు దోచుకు పోయారు.

వృథాను అరికడితే వెతలుండవ్‌

విద్యుత్‌ పొదుపునకు చర్యలు తీసుకోండి
మీరు 8209 మిలియన్‌ యూనిట్లు ఆదా చేయొచ్చు
రాష్ట్రానికి కేంద్ర విద్యుత్‌ శాఖ కార్యదర్శి లేఖ
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
దేశ వ్యాప్తంగా విద్యుత్‌ వినియోగం
- 501 బిలియన్‌ యూనిట్లు డిమాండ్‌, సరఫరా మధ్య లోటు
- 73 బిలియన్‌ యూనిట్లు
పొదుపు చేయడానికి ఉన్న అవకాశం
- 75.36 బిలియన్‌ యూనిట్లు
...అంటే దేశంలో ఎక్కడా కరెంటు కోతకు ఆస్కారం లేకుండా చేయొచ్చు. జాతీయ ఉత్పాదక మండలి అధ్యయనం చెబుతున్న వాస్తవమిది. ఆంధ్రప్రదేశ్‌లో 8209 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ పొదుపు చేయడానికి అవకాశాలున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. విద్యుత్‌ వినియోగం తీరు, పొదుపు ఆవశ్యకతపై కేంద్ర విద్యుత్‌ శాఖ కార్యదర్శి పి.ఉమాశంకర్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి తాజాగా ఓ లేఖ రాశారు. ఆదా చేయడం విద్యుత్‌ విధానంలో భాగంగా గుర్తించాలనీ, డిమాండ్‌ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. వ్యవసాయం, పారిశ్రామికరంగం, గృహ వినియోగంలో విద్యుత్‌ ఆదాకు చర్యలు చేపట్టాలని సూచించారు. రంగాల వారీగా విద్యుత్‌ దుబారా ఎలా అవుతోందో గణాంకాలతో వివరించారు. ఆయన లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం... వ్యవసాయ విద్యుత్‌ వినియోగంలో దుబారాను నివారించి, వాణిజ్యపరంగా లాభాలు ఆర్జించే మార్గాలపై కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మక చర్యలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ పంపుల సామర్థ్యం పెంచాలి. దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో 277786.97 మిలియన్‌ యూనిట్ల వాడకం నివారించడానికి వీలుంది. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే 4340 మిలియన్‌ యూనిట్లు వృథా అవుతోంది. ఆ తర్వాత గుజరాత్‌లో ఎక్కువగా వృథా జరుగుతోంది. పురపాలక సంఘాల పరిధిలోనూ విద్యుత్‌ యాజమాన్యం పాటించాలి. వీధి దీపాలు, తాగునీరు, మురుగునీటి సరఫరాలో విద్యుత్‌ వినియోగాన్ని క్రమబద్ధీకరించి వృథాను అరికట్టాలి. పురపాలక సంఘాల్లో విద్యుత్‌ ఆదాకు ఉన్న అవకాశాలపై బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ(బీఈఈ) దాదాపు 90 రకాలపై ప్రాజెక్టులు సిద్ధంచేసింది. వీటిని పురపాలక సంఘాలు వినియోగించుకోవాలి. ఒరిస్సా, రాజస్థాన్‌లు విద్యుత్‌ పొదుపు భవన నమూనాను అమలుచేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు దీనిని అనుసరించాలి. 500 యూనిట్లకు మించి విద్యుత్‌ వాడుతున్న వాణిజ్య భవనాల్లో 1947 మిలియన్‌ యూనిట్లు పొదుపు చేయడానికి అవకాశాలున్నాయి. రాష్ట్రంలో 197 మిలియన్‌ యూనిట్లు పొదుపు చేయొచ్చు. ఇక పురపాలక సంస్థల్లో 2882.81 మిలియన్‌ యూనిట్లు ఆదా చేయడానికి వీలుంది. విద్యుత్‌ సామర్థ్యం, పనితీరు, వ్యాపార పథకాన్ని బీఈఈ జాతీయస్థాయి కార్యక్రమంగా మొదలుపెట్టింది. ఈ పథకం కింద రాష్ట్రంలో అధిక విద్యుత్‌ వినియోగ పరిశ్రమల్ని గుర్తించి ఆదాకు మూడేళ్ల లక్ష్యాల్ని నిర్దేశించాలి. ఆదాకు ఆ పరిశ్రమలు చేపట్టే చర్యల్ని ప్రభుత్వ ఏజెన్సీ పర్యవేక్షిస్తుంది.
వృథాలో ముందంజ
విద్యుత్‌ వృథాను అరికట్టడానికి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక వెల్లడిస్తోంది. వినియోగంలో వరుసగా గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఉన్నా.. వృథాను అరికట్టి విద్యుత్‌ను పొదుపు చేయడానికి ఇక్కడే ఎక్కువ ఆస్కారం ఉంది. రాష్ట్రంలో లోటు కేవలం 2628 మిలియన్‌ యూనిట్లే. అంటే దుబారాను సగం అరికట్టినా లోటుభర్తీతో పాటు మిగులు కరెంటు సాధించడానికి అవకాశం ఉంది.

ఇక సత్వర పరిష్కారం!



పెండింగ్‌ కేసులకు ప్రత్యేక కోర్టులు
రూ.5వేల కోట్ల కేంద్ర నిధులు
మాజీ న్యాయమూర్తులకు మళ్లీ విధులు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
కోర్టుల్లో ఓ పట్టాన తెమలని కేసులతో ప్రజల్లో న్యాయవ్యవస్థపై సడలుతున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కింది కోర్టుల్లో 5 ఏళ్ల ప్రణాళికను నిర్దేశించుకుంది. ప్రస్తుతం కోర్టుల్లో ఒక్కో కేసు తేలడానికి 15 ఏళ్లకు పైగానే పడుతోంది. దీన్ని 3 ఏళ్లకు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం 13వ ఆర్థిక సంఘం రూ.5వేల కోట్లను కేటాయించింది. మొదటి విడతగా రాష్ట్రాలకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలోని కింది కోర్టుల్లో 2.71 కోట్లకు పైగా కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇందులో 40% చిన్న కేసులుంటాయని ఆర్థిక సంఘం అంచనా. 2010-2014 కల్లా ఇందులో 2.25 కోట్ల కేసులను పరిష్కరించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనికోసం 13వ ఆర్థిక సంఘం నిధులతో దేశవ్యాప్తంగా 14825 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనుంది. వీటిలోకి మాజీ జడ్జిలను, లేదంటే అవే అర్హతలున్న వ్యక్తులను కాంట్రాక్టు పద్ధతిన తీసుకోనుంది. వీరు నెలకు 150 కేసులను పరిష్కరించాల్సి ఉంటుంది. వీటితోపాటు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గం (ఏడీఆర్‌), లోక్‌అదాలత్‌ల బలోపేతానికి నిధుల కేటాయించారు. ఈ ప్రణాళిక అమలులో భాగంగా ఢిల్లీలో ఇటీవల అన్ని రాష్ట్రాల న్యాయశాఖ కార్యదర్శులు, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరళ్ల సమావేశాన్ని కేంద్రం నిర్వహించింది. 13వ ఆర్థిక సంఘం రూపొందించిన మార్గదర్శకాల్లో ఆచరణ సాధ్యం కాని అంశాలను సవరించాలని సమావేశం తీర్మానించింది. ప్రస్తుతం ఉన్న జడ్జీలకు అదనపు వేతనం చెల్లిస్తూ ఉదయం, సాయంత్రం కోర్టుల ద్వారా కేసులను పరిష్కరించాలని తొలుత నిర్ణయించినా, ఇది వారిపై మరింత భారాన్ని మోపుతుందని పేర్కొన్నారు. అందువల్ల ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
రాష్ట్రంలోనూ..
పెండెన్సీ కేసుల పరిష్కారానికిగాను కేంద్రం రాష్ట్రానికి రూ.270 కోట్లను కేటాయించింది. ఇందులో రూ.145.18 కోట్లను ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు కేటాయింపు జరిగింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు పంపిన ప్రతిపాదనలను ఆమోదించింది. ఇందులో భాగంగా 140 ప్రత్యేక మేజిస్ట్రేట్‌ కోర్టులు, 113 ప్రత్యేక జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులను ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9.62 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2013 కల్లా వీటి సంఖ్యను 2.15 లక్షలకు తీసుకురావాలన్నది లక్ష్యం.
* ఒక్కో ప్రత్యేక మేజిస్ట్రేట్‌ కోర్టు ఏర్పాటుకు రూ.14.56 లక్షలవుతుందని అంచనా. 140 ప్రత్యేక కోర్టుల జడ్జీలకు జీతాలకు రూ.21 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల కోసం మొదటి ఏడాది రూ.2.80 కోట్లు అవసరమని లెక్కకట్టింది.
* ఒక్కో జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు ఏడాదికి సుమారు రూ.1.26 లక్షల ఖర్చవుతుందని అంచనా. 113 కోర్టులకుగాను సుమారు రూ.1.47 కోట్లవుతుంది.
* ఈ కోర్టుల్లో ఇప్పటికే నియామక ప్రక్రియ మొదలైంది. ఒకటి రెండు నెలల్లో ప్రత్యేక కోర్టులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాదికల్లా పూర్తిస్థాయిలో కోర్టుల ఏర్పాటు జరగనుంది.

రాష్ట్రానికి కేంద్రం షాక్‌!

తొలివిడతకు ఆగిన రూ.2298 కోట్లు
సందిగ్ధంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం-2
మార్చిలోగా నిధులు ఖర్చయ్యేనా!
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
వహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం(జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) రెండోవిడతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరో ఎనిమిది నెలల్లో తొలివిడత పథకం ముగుస్తుందనగా..కేంద్రప్రభుత్వం రూ.2298 కోట్లను నిలిపివేసింది. తాము ఇచ్చిన నిధులను సకాలంలో ఖర్చు చేయకపోవడం, రాష్ట్రవాటా కింద భరించాల్సిన మొత్తాన్ని ఇవ్వకపోవడంతో కేంద్రం కినుక వహించింది. రాష్ట్రానికి ఈ మేరకు కేంద్రం షాక్‌ ఇచ్చింది. ఇచ్చిన నిధులు ఖర్చుచేసి.. వినియోగ పత్రాలు (యూసీ) సమర్పిస్తేనే చివరి విడత కింద రూ.2298కోట్లు మంజూరు చేస్తామంటూ తేల్చి చెప్పింది. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద రాష్ట్రానికి రూ.12,525కోట్ల విలువైన 268 ప్రాజెక్టులను మంజూరు చేశారు. దీనికింద నగరాలు, పట్టణాల్లో తాగునీటి ప్రాజెక్టులు, గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ, వరదనీటి కాలువలు, మురికివాడల అభివృద్ధి, రోడ్లు తదితర పనులు చేపడుతున్నారు. 2005లో ప్రారంభమైన ఈ పథకాలన్నీ విడతల వారీగా 2012 మార్చి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో కేంద్రం వాటా రూ.6984.16 కోట్లు కాగా 2010-11 ఏడాది నాటికి రూ.4685.96 కోట్లను విడుదల చేసింది. అయితే, కేంద్రం నిధులిచ్చినా రాష్ట్రంలో ప్రాజెక్టు అమలు పర్యవేక్షిస్తున్న రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీయూఎఫ్‌ఐడీసీ)కి ఇవ్వలేదు. కేంద్ర నిధులను గత కొన్నేళ్లుగా సకాలంలో విడుదల చేయకుండా.. ఆర్థికశాఖ తమవద్ద పెట్టుకుంటోంది. ఈ పరిస్థితి గమనించిన కేంద్రం గత ఆర్థిక సంవత్సరం కింద రావాల్సిన నిధుల్లో రూ.1000 కోట్లకు కోత పెట్టింది. అయితే, ప్రభుత్వ పెద్దల జోక్యంతో ఐదు నెలల క్రితమే రూ.500 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులనూ నేటికీ పూర్తిస్థాయిలో నిధులు ఏపీయూఎఫ్‌ఐడీసీకి ఇవ్వలేదు. ఇప్పటికీ రూ.300కోట్లు తమవద్దే పెట్టుకుంది. ఇదిలా ఉంటే...2012 మార్చితో తొలివిడత ప్రాజెక్టు అమలు గడువు ముగియనుంది. ఆలోగా నిధులన్నీ వెచ్చించి పనులు పూర్తిచేయాలి. 2012-13 ఆర్థిక సంవత్సరం నుంచి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం-2కు పథకం అమల్లోకి వస్తుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ వ్యవధిలోగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలన్నీ పూర్తిచేయకుంటే.. రాష్ట్రానికి మొండి చేయి తప్పదు.

 
Creative Commons License
Open News Magazine by Nivedika is licensed under a Creative Commons Attribution 3.0 Unported License.
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates